నేర నియంత్రణకు ఎన్‌కౌంటర్లే పరిష్కారమా?

తెలంగాణ కార్మికశాఖామంత్రి మల్లారెడ్డిగతసెప్టెంబరు పదో తేదీన  హైదరాబాదు సింగరేణి కాలనీలో అత్యాచారానికి, హత్యకూ గురైన చిన్నారి విషయమై సెప్టెంబరు 13న విలేఖరుల ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ సంఘటనకు సంబంధించిన అనుమానితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్‌ చేస్తామని బహిరంగంగా ప్రకటించడంప్రసార, ముద్రణా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఎన్కౌంటర్ అంటే "పట్టుకొని కాల్చివేయడం" అని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్వయంగా అంగీకరించినట్లు అర్థం ఔతోంది.  తరువాత ఈ కేసులో ముద్దాయి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటన విడుదల అయింది. ఇది ఆత్మహత్య కాదు. కొత్తరకం ఎన్కౌంటరేనంటూ వివిధ సామాజిక, ప్రసార ప్రచురణ మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తేయి. మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ కూడా దీనిపై స్పందించి, ఈ అంశంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన, అతని మరణానికి సంబంధించి  అనేక సహేతుకమైన ప్రశ్నలు లేవనెత్తి దీన్ని ఒక కొత్త తరహా ఎన్కౌంటర్ గా కాదనలేని నిజాన్ని బయట పెట్టేడు.   ఇటువంటివి చూస్తుంటే, మనసమాజం, రాజ్యం, ఎంత అమానవీయంగా చట్టపర చర్యలు, న్యాయాలకు అతీతంగా ఆలోచిస్తున్నాయో అర్థమైతుంది; గతంలో ఒక కమ్మ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు కంకణాల నారాయణ గారు దిశ ఎన్కౌంటర్ సంఘటనను బహిరంగంగానే సమర్ధించి, తర్వాత నాలుక కరచుకున్న సందర్భం కూడా మనం చూశాం. మానభంగ హత్యలకు నిరసనగా ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో ఉంటోంది. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం  సహజం. ఐతే ఇటువంటి దుర్మార్గులను నేరస్తులుగా రుజువు చేసి ఎంతటి కఠిన శిక్షఐనా విధించవచ్చు. కానీ, రాజ్యయంత్రాంగం లైంగిక దాడుల్ని అరికట్టడంలో విఫలమవడాన్ని గురించి పట్టించుకోని మనరక్షకభట యంత్రాంగం నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంద్వారా మరొక న్యాయ ఉల్లంఘనకు పాల్బడుతోంది. అంతేకాకుండా, ఆడపిల్లలపై అత్యాచారాలవంటి తీవ్ర నేరాలలో న్యాయస్థాన విచారణ జరపడం, అక్కడ నిజానిజాలు నిగ్గుతేల్చి, నేరం వ్యవస్థాపితమైన తర్వాత,  ఉరిశిక్ష, లేదా ఇతరత్రా శిక్షించడం వంటి పద్ధతులన్నీ దండగమారి వ్యవహారంగా ప్రజలు భావించే విధానానికి ప్రోత్సాహం ఇస్తున్నారు.గత కొన్ని దశాబ్దాలుగా  నక్సల్బరీ విప్లవకారులమీద ప్రథానంగా ఉపయోగించిన ఈ ఎన్కౌంటర్ పద్ధతిని, వర్తమానంలో ఇతరత్రా కూడా ఉపయోగించుకొంటున్నారు.  దాదాపుగా అన్నీ కేసులలోనూ, నిందితులను అదుపులోకి తీసుకున్నతరువాతే ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లుగా స్పష్టమౌతోంది. దశాబ్దాలుగా వస్తున్న ఈఎన్‌కౌంటర్‌ సంస్కృతిని గతంలో ప్రజలంతా  తీవ్రంగా వ్యతిరేకించి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోమని కోరేవారు. కానీ, పోలీసులే ముద్దాయిల్ని శిక్షించే ఈకొత్తరకపుసంస్కృతికి  నేటిరోజుల్లో విస్తృతంగా ప్రజల మద్దతు లభిస్తున్న స్థితి నెలకొని ఉంది. ‘తీవ్రమైన నేరాలకు పాల్బడ్డవారిని ఎన్‌కౌంటర్‌ హత్యలు చేయటంకూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందా?’ అని ప్రశ్నించే కుహనా మేథావులు కూడా   మన సమాజంలో  ఉన్నారు. ఈ అమానవీయ చర్య ముద్దాయికి ఉన్న మానవ హక్కుల్ని హరించడంగా నిర్ద్వందంగా చెప్పుకోవాల్సుంటుంది.  ఈ ఎన్‌కౌంటర్‌ హత్యలు, ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని చట్టవ్యతిరేక నేర చర్యలుగా పరిగణించే చైతన్యం ప్రజల్లో ఇంకా పెరగాల్సి వుంది.   ఈ ఎన్కౌంటర్లు సాధారణంగా పోలీసు, మిలిటరీ, సాయుధ బలగాల చేతులతోనే జరుగు తుంటాయి. ఈవిధమైన చర్యలకు పాల్బడడం, నాగరిక సమాజంలో, వందల సంవత్సరాల పోరాటాలతో నాగరిక సమాజం సాధించిన 'చట్టసమానత్వపు హక్కు' ను అన్యాయంగా అణచివేయడమే ఔతుంది.ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసు అధికారులకు సమాజంలోని మెథావులు,  ప్రజాస్వామ్య ప్రియులనుంచీ , న్యాయస్థానాలనుంచీ, ప్రతిసారీ  ప్రశ్నలు ఎదురౌతూనే వుంటాయి.    ఎప్పుడు ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా, అందుకు సంబంధించి బాధ్యత వహించాల్సిన పోలీసు అధికారులు మాత్రం తు.చ తప్పకుండా ఏమాత్రం మార్పులేకుండా, తామెదుర్కొనే ప్రశ్నలకుసమాథానంగా ఎప్పుడూ దాదాపుగా ఒకే కథ వినిపిస్తుంటారు. ‘సదరు ముద్దాయిని తీసుకువెళుతున్న పోలీసు అధికారిదగ్గర్నుంచీ వారి అదుపులో ఉన్న నిందితవ్యక్తి, తుపాకి లేదా బారుతుపాకీ తీసుకుని, పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోతుండగా, ఆత్మరక్షణార్థం తాము జరిపిన కాల్పుల్లో ముద్దాయి చనిపోయాడనేదే దాదాపు అన్ని సార్లూ, వారుచెప్పే, పెద్దగా సవరణలు లేని కథనం. ఐతే ఈ ఎదురు కాల్పులలో, దాదాపుగా ప్రతిసారీ  నిందితులే ఎన్కౌంటర్ అయిపోతారుగానీ పోలీసు, సాయుధ బలగాలకు ఏమాత్రం చిన్న చిన్న గాయాలు అయినట్లుగాకూడా తెలియరాదు. ఎన్కౌంటర్లంటే, భారత రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ఉన్నప్రాణరక్షణ అనే  ప్రాధమిక హక్కుని ఉల్లంఘించడంగా భావించాలి. నేరం చేసినట్లుగా భావించిన వ్యక్తితో సహా ఏరకమైన మినహాయింపూ లేకుండా ఇది అందరకూ సమానంగా వర్తిస్తుంది. హీనమైన దుర్మార్గపు నేరం చేసిన వ్యక్తితో సహా , ఎవరిమీదనైనా పారదర్శకంగా నేరాన్ని దర్యాప్తు చేయడం, న్యాయవిచారణ జరపడం అనేవి అవసరం. రాజ్యాంగపు 14వ  అధికరణం ప్రసాదించిన "చట్టం ముందు అందరూ సమానమే" అనే హామీని కాపాడడం కోసం కూడా ఇది అత్యవసరమైన విధానం. 

          భారత దేశంలో ఏపరిస్థితులలో ఒక ఎన్కౌంటర్  నేరం కాకుండా పోతుందో చూద్దాం. మొదటగా, భారతీయ శిక్షాస్మృతి 1860 లోని సెక్షన్ 96 ప్రకారం లేదా సెక్షన్ 300 లోని, (3) మినహాయించి గానీ,  సాధారణ పౌరునికి ఉండే హక్కుమాదిరిగా, వ్యక్తిగత ప్రాణ రక్షణకోసం, జీవించే హక్కు కోసం పోరాడే సందర్భంలో నేరం కిందికి రాదు.  ఇది  సాయుధ బలగాలకే కాక సాధారణ పౌరునికి కూడా వర్తిస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 లోని సెక్షన్ 46 ప్రకారం,యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించదగిన నేరాలలో ముద్దాయిని పట్టుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో, ముద్దాయితో  జరిగే ఘర్షణలో తీవ్ర బలప్రయోగం జరపవచ్చు. ఈ చూస్తే, శాంతి భద్రతలను కాపాడడానికి, ఆత్మరక్షణ చర్యగా మాత్రమే పోలీసులు నిందిత వ్యక్తిపై తీవ్ర బలప్రయోగం చేసే అవకాశముంది. సెక్షన్ 300 (3)ప్రకారం అర్థమయేదేమంటే, దురుద్దేశంతోగానీ, అనైతికంగాగానీ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం లేదా అధికారంలోఉన్న రాజకీయ నాయకుల  మెప్పు పొందడంకోసం ఎన్కౌంటర్  చేసేట్లయితే వారిని నేరస్తులుగా భావించి, ఐ‌పి‌సి 299 కింద కేసు నమోదు చేయాలి. 

   భారత సర్వోన్నత న్యాయస్థానం 2011లో జరిగిన ప్రకాష్ కదంకు, రాంప్రసాద్ విశ్వ గుప్తాకూ జరిగిన వ్యాజ్యంలో తీర్పు ఇస్తూ, రక్షక భటులపై విచారణలో, వారు న్యాయ విచారణచట్టాన్ని చేతిలోకి తీసుకుని  హత్యకు పాల్బడినట్లుగా రుజువైతే, సదరు రక్షక భటులకు మరణ శిక్ష విధించాలని పేర్కొనడం జరిగింది. అనేక కేసుల్లో ఇటువంటి తీర్పులు వచ్చినట్లుగా కూడా మనకు వార్తలద్వారా తెలుస్తోంది. 

      ఈ చట్టవిరుద్ధ హత్యలకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం, జాతీయ మానవహక్కులసంఘం, వంటి రాజ్యాంగ సంస్థలు  తీవ్రంగా స్పందించడం జరుగుతోంది. చట్టాన్ని అమలుచేసే సంస్థలు అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు, ఈరెండు సంస్థలూ అనేక మార్గదర్శకాల్ని జారీ చేశాయి. అలానే, సర్వోన్నత న్యాయస్థానం, 2012లో   ఓంప్రకాష్ కు జార్ఖండ్ ప్రభుత్వానికీ మధ్య జరిగిన వివాదంలో, తీర్పునిస్తూ, చట్టవ్యతిరేక హత్యలను రాజ్యహింస కిందికి వచ్చేవిగా పేర్కొంది. 

   జాతీయ మానవహక్కుల సంఘం నిర్దేశాల ప్రకారం, 'ఎప్పుడు ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా, సదరు నేరచర్యకు బాధ్యునిగా ఆరోపణ ఎదుక్కొంటున్న పోలీసు అథికారిపై ప్రాథమిక సమాచార నివేదికను నమోదుచేసి, భారతీయశిక్షాస్మృతిలోని సంబంధిత విభాగాల్ని కూడా పొందుపరచాలి. నలబైఎనిమిది గంటల సమయంలోగా సదరు ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల సంఘానికి నివేదిక పంపాలి; సదరు విచారణను గురించి మూడునెలలలోగా కమిషన్‌కు మరో నివేదిక సమర్పించాలి. ప్రాథమిక నివేదిక (ఎఫ్‌ఐ‌ఆర్)ను సంబంధిత అధికారిక నమోదు పుస్తకంలో ఎక్కించాలి. ఈ విషయాలకు సంబంధించిన విచారణను అదేపోలీసు  విభాగానికి కాకుండా, స్వతంత్రంగావ్యవహరించే రాష్ట్ర నేరవిచారణ శాఖ (సిఐడి) వంటి సంస్థలకు అప్పగించాలి. వ్యక్తిగత భద్రత హక్కును కాపాడుకునే క్రమంలో మరణం సంభవిస్తే, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 100కింద అభియోగం నమోదు చేయాలి.'

      సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం, ఇటువంటి సందర్భాల్లో ప్రాథమిక సమాచార నివేదికను నమోదుచేసి, నేరన్యాయవిధాన సంహిత (ఐపిసి)లోని సెక్షన్‌ 157 ప్రకారం న్యాయస్థానానికి దాని ప్రతిని పంపాలి. సెక్షన్‌ 190కింద, అథికార పరిధి ఉన్న న్యాయాథికారికి నివేదిక పంపాలి. ఈసంఘటననుగురించిన సమాచారాన్ని  జాతీయ మానవహక్కుల సంఘానికికానీ, రాష్ల్ర మానవహక్కుల సంఘానికిగానీ నివేదిక రూపంలో పంపాలి. మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలి. నమోదైన సమాచారాన్ని అంకాత్మకంగా (ఏలెక్ట్రానికల్లీ)కానీ, రాతపూర్వకంగాగానీ కుటుంబీకులకు, దగ్గర బంధువులకు  తెలియజేయాలి. ఎన్‌కౌంటర్‌కు గురైనవారికి తక్షణ వైద్యసహాయం అందించాలి. భారత రాజ్యాంగంలోని అధికరణం 141 కింద అన్ని పోలీసు ఎన్‌కౌంటర్లలోనూ ఈ ప్రమాణాల్ని విధిగా పాటించాల్సిందిగా కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. చట్టసమత్వంకోసం, ప్రాథమిక హక్కుగా ఉన్న జీవించే హక్కు, స్వాతంత్య్రపు హక్కు,  పారదర్శక న్యాయ ప్రక్రియల అమలుకోసం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ వీటిని పోలీసు యంత్రాంగం కాతరు చేయని స్థితినెలకొంది. ఉల్లంఘనలు నిత్యకృత్యంగా మారేయి. 

   ఉదాహరణకు హైదరాబాద్‌లో జరిగిన దిశ(గుర్తింపు దాయడానికి పోలీసులు పెట్టిన పేరు) హత్య విషయంలో, పోలీసులు చెప్పే ప్రకారం, నలుగురు నిందితులు ఆమెను మానభంగం చేసి, అనంతరం ట్రక్కులో వేరే చోటికి తీసుకువెళ్లి శవాన్ని కాల్చేశారనేది పోలీసు విచారణలో తెలినట్లు ప్రకటించారు. సరైన విచారణ లేకుండా వారిని ఎన్కౌంటర్ చేసేరు. వీరిపై సత్వర చర్యలు తీసుకోవలసిందిగా తెలంగాణ పోలీసులపై ఒత్తిడి వచ్చినందువల్లే ఈ ఎన్కౌంటర్లు జరిగేయనేది ప్రచారంలో ఉంది.   నిందితులను  ఎన్‌కౌంటర్‌   చేయడానికి ముఖ్య కారణం ధనం, అధికారం ఉన్న కొందరు పెద్ద కుటుంబాలవారిని కాపాడడానికేమోనని వివిధ మాధ్యమాల్లో అనుమానాలు వ్యక్తమయేయి. విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టంగా అర్థమైతోంది. నిరాయుధులుగా, సంకెళ్ళు వేసిఉన్న నిందితులు అకస్మాత్తుగా పోలీసులపై రాళ్ళు, కర్రలూ విసిరి దాడికి పాల్బడడంతో కాల్చి చంపాల్సివచ్చిందని యథాప్రకారం పేర్కొన్నారు.ఈ సంఘటనకు స్పందించిన ఎపి ప్రభుత్వం, ఇటువంటి హీనమైన నేరాలకు పాల్బడ్డ వారికి మరింత ఖఠిన శిక్షలు నిర్దేసిస్తూ,  'దిశ' చట్టం తెచ్చింది. ఇట్లా చట్టాలు తేవడం ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పేరుతెచ్చుకోవాలనే ఉబలాటంతప్ప మరేమీ కాదనేది తేలికగా అర్థం ఔతోంది.   ఉపుడున్న చట్టాల అమలుతీరే ఇందుకు నిదర్శనం.   దిశ ఎన్కౌంటర్ పై ఉన్న అనుమానాల దృష్ట్యా, వాటిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ను నియమించింది. .

         నేరస్థముఠా నాయకుడు నయీం విషయంలో, పెద్ద పెద్ద అధికార పదవులలో ఉన్నవారి బండారాలు బయట పడతాయనే అతన్ని ఎన్కౌంటర్ చేసినట్లు చెప్పుకున్నారు.  నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత దొరికిన దస్త్రాల్లో పెద్దపెద్ద రాజకీయ నాయకులు, ఐఎఎస్, ఐపిఎస్‌ లతో సహా అనేకమంది ఉన్నతాధికారుల బండారాలు బయట పడతాయని, పెద్ద సునామీ రాబోతున్నట్లుగానూ అన్ని పత్రికలలోనూ వార్తలు వచ్చాయి. కానీ ఏళ్ళుగడిచినా వాటి విషయం ఏమీ బయటకు రాలేదు. నయీం బతికిఉంటే వీళ్ళందరి బండారాలూ బయటకు వస్తాయనే అతన్ని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ఆనాడే అనుమానాలువ్యక్తమయయి. ఉజ్జయినివద్ద జరిగిన వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ కేసులో, మరుసటిరోజు లొంగిపోతాన్న్న వికాస్‌ దుబేను ఒకరోజు ముందుగానే ఎన్‌కౌంటర్‌ చేశారు. వికాస్ దుబే హత్యకు కారణం కూడా ఇట్లాటిదే.  పెద్ద పెద్ద అధికార స్థానాల్లోనివారి బండారాలు బయటపడతాయనే భయంతోనే వికాస్ దుబే హత్యజరిగినట్లు అర్థమౌతోంది. 

       ఇటీవల, సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి మానభంగం, హత్యకేసులో సైతం అనుమానితుడు ఆత్మహత్య చేసుకోవడంపై పత్రికలలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయేయి. న్యాయవిచారణ, ఉరిశిక్షలవంటివన్నీ అవసరంలేదనే పద్ధతిలోకి, ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ వంటి అనాగరిక విధానాలే మేలనే పద్ధతిలోకి, జనాల్ని నెట్టే ప్రమాదకర ధోరణులు చోటుచేసుకొన్నాయి, గతంలో వరంగల్‌ ఏసిడ్‌ దాడి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు కూడా అందుకు కారణమైన పోలీసులకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించడం ఇందుకు ఉదాహరణ. కొన్ని మంచిగా కనుపించే పనులు చేసిన పోలీసు యంత్రాంగానికి అపరిమిత అధికారాలివ్వడం ద్వారా వాళ్ళు చేసే అన్ని చర్యలకూ మద్దతు ఇవ్వడంవంటి దుష్టసంప్రదాయం నెలకొంటుంది. వాళ్ళు రాజకీయ ప్రాపకం కోసం లేదా సొంత లాభంకోసం అధికారదుర్వినియోగం చేయరనే నమ్మకంలేదు. ఏమిచేసినా న్యాయం చేయడం కోసమే నని, జనాల మద్దతు తమకు ఉందని విర్రవీగుతూ,  స్వార్ధంకోసం ఎంతటి అకృత్యాలకైనా తెగబడే అవకాశం కల్పించే ప్రమాదం ఉంది. పోలీసులు నేరం కింద నమోదు చేసేవన్నీ, అదుపులోకి తీసుకునే చర్యలన్నీ నమ్మడానికి వీలు లేనివాని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. 

 ప్రజల్లో అనేకమంది భావించేట్లు నేరస్తులుగా భావించినవారిని  న్యాయప్రక్రియకు అతీతంగా ఎంకౌంటర్ చేసి చంపడం సరయిన చర్య అవుతుందా? ఇట్లా చేయడం వలన నేరాలు తగ్గేయా? అని ప్రశ్నించుకుంటే, "లేదు" అనే సమాధానమే వస్తుంది. ప్రజల్లో కొందరి మనోభావాల నొచ్చుకున్నాయని ఇలా నేరస్తులను ఎన్కౌంటర్ చేయడంవల్ల నేరాలు ఆగినట్లు ఎక్కడా దాఖలాలు లేవు.పోలీసులు, అధికారంలో ఉన్న రాజకీయ బాసులూ ఏది చెపితే అదే ప్రజలంతా నమ్మాలనేది కూడా అన్యాయం. వాళ్ళు ఎప్పుడూ నిజాయితీగా, న్యాయంగా వ్యవహరిస్తారని నమ్మడం అవివేకం. పోలీసు యంత్రాంగం రాజకీయ నేతలకు ఎట్లా అడుగులకు మడుగులోత్తుతూ, వాళ్ళకు ఊడిగం చేస్తుందనే అంశంపై, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వాఖ్యలుకూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిఉంది. పైగా పోలీసు యంత్రాంగం చెప్పినంతమాత్రాన ఆ వ్యక్తులు నేరం చేశారని రుజువు అయినట్లు కాదు.   ఇందుకు మద్దతుగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో  జరిగిన కొన్ని సంఘటనలను చూడవచ్చు. 

    గతంలో, విజయవాడలో అత్యాచారానికీ, హత్యకూ గురయిన ఆయెషా బేగంహత్య కేసులో   సత్యంబాబు పరిస్థితి  ఇందుకు సరైన ఉదాహరణ. హతురాలి తల్లిదండ్రులు తొలినుంచీ అతనిపై అనుమానం లేదని, అధికారంలో ఉన్నవారి సంతానాన్ని కాపాడడానికే సత్యం బాబుమీద నేరం మోపేరనీ, న్యాయంగా విచారణ జరిపి అసలు హంతకులను పట్టుకోమనీ ఎంతగా మొత్తుకున్నా వినలేదు. ఒకసందర్భంలో అతడిని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. సంవత్సరాలతరబడి నిర్భంధించి, దాదాపు అతను అంగవికలుడిగా మారిన తరువాత నిర్దోషిగా తేల్చారు. నిన్నగాకమొన్న, గాంధీ ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డ్ లపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. కొందరైతే, ఇట్లాంటివాళ్లని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సక్రమంగా విచారణ జరగడంతో, అది తప్పుడు అభియోగంగా తేలింది. అదేవిధంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో, ఒక ఫార్మసీ విద్యార్ధి తనను కొందరు ఆటో డ్రైవర్లు అపహరించి, మానభంగానికి గురి చేశారని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసు యంత్రాంగం కొందరు ఆటో డ్రైవర్లను పట్టుకొని నేరం మోపింది. ఇక్కడా తక్షణ న్యాయం కోసం వాళ్ళని ఎంకౌంటర్ చేయాలనే డిమాండ్లు వచ్చేయి.  చేస్తున్నారనే పుకార్లూ షికారు చేశాయి. ఈలోపు జరిగిన విచారణలో, ఆమె తన ప్రియుడితో కలిసి తిరిగి, ఇంటికి రాలేదేమని ఇంట్లో అడుగుతారని భయపడి ఈ కట్టు కథ అల్లినట్లు తెలిసింది. ఇట్లా ఆలస్యంగా  విచారణ జరిగి వాస్తవాలు వెల్లడి కావడానికి వాటిల్లో పెద్దల హస్తం లేకపోవడమే కారణమని అనుకొన్నారు. ఎక్కడ ఏనేరమైనా, దళితులు, పేదలు, బలహీన వర్గాలవారు సత్వరం బలవుతున్నారు కానీ ఇతరులవిషయంలో దర్యాప్తు పూర్తికావడానికీ, నేర స్థాపనకు దశాబ్దాల తరబడి న్యాయ ప్రక్రియ  కొనసాగి, వారు బతికిఉన్న కాలంలో కేసు కొలిక్కిరాని స్థితిగతులు ఉన్నాయి. అంటే, డబ్బు, అధికారమే పరోక్షంగా న్యాయాన్ని ప్రభావితం చేస్తున్న స్థితిగతులు ఉన్నాయి. 

     వర్తమానంలో వినియోగ సంస్కృతివల్ల ఛిద్రమౌతున్న మానవ విలువలు, పతనమౌతున్న కుటుంబ వ్యవస్థలు, మృగ్యమౌతున్న ఆత్మీయతా మానవ సంబంధాలూ, వ్యక్తి సుఖం తప్ప మరేదీ ముఖ్యం కాదనే భావనలను వ్యాప్తి చేస్తున్నాయి. ఉపాధిలేమి వల్ల, భూసేకరణ కారణంగా కుటుంబాలు నిర్వాసితులైన ఫలితంగా  విచ్ఛిన్నమౌతున్న కుటుంబాలనుంచీ వచ్చిన పిల్లలు అమానుషత్వానికి బలి కావడమో,  అమానుషంగా తయారు కావడమో జరుగుతున్నది. చౌకగా (కొన్ని ప్రదేశాలలో ఉచితంగా కూడా)  దొరికే అంతర్జాల అనుసంధానం వల్ల కౌమార ప్రాయపు వ్యక్తులతో సహా విపరీతంగా మెదళ్ళను విషపూరితం చేస్తున్న నీలి వీడియోలు, నేరప్రవృత్తికి దోహదం చేస్తున్నాయి. చలన చిత్రాలు, పాఠ్యాంశాల్లో మహిళను మెదడు, వ్యక్తిత్వమున్న సమాన స్థాయి వ్యక్తిగా చూపేందుకు, పాఠశాలల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు సక్రమంగా  బోధించే చర్యలు తీసుకొని, సంస్కారవంతమైన ప్రవర్తనకు బాటలు వేయాలి. ఈ పరిస్థితులపై దృష్టి సారించి, సాంస్కృతిక మార్పుకై కృషి చేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక దృక్పధంలో  మార్పుకై చర్యలు తీసుకోకుండా ఏ ఉపయోగంలేదనే  అంశం  ప్రభుత్వాలకుపట్టదు. తక్షణ ప్రయోజనాలే వారికీముఖ్యం. వెలుగులోకి రాకుండా ఇటువంటివి అనేక సంఘటనలు ఉండే అవకాశముంది. ఈ అంశాలపై  పౌర సమాజం, ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాలు, ప్రజా సంఘాలు దృష్టి పెడితే, చాలావరకూ ప్రభుత్వం కూడా దిగివచ్చే వీలుంది. 

     రాజ్యయంత్రాంగానికి చట్టసమత్వ భావనపై అవగాహన,  నిబద్ధతలు లేకపోవడంవల్ల డబ్బు, అధికారం ఉన్నవాళ్ళపట్ల, దిక్కూదివాణం లేనివారిపట్లా న్యాయం అమలుచేసే తీరుతెన్నుల్లో తీవ్ర అంతరం కనబడుతోంది. న్యాయం చేయాలన్నా, కేసు నమోదు చేసుకోవాలన్నా, ఇక్కడ కులం, డబ్బు, అధికారం ప్రధాన పాత్ర వహిస్తున్నాయనేది నిత్యం మనకళ్ళముందు చూస్తూనే ఉన్నాం. దీనికి వత్తాసుగా రాజ్యమే హింసను ప్రేరేపించడం చూస్తున్నాం.  ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని మానవ హక్కులను అణచివేయడంగా చూడాలి. దేశ భద్రతవంటి తీవ్ర స్వభావమున్న లేదా వ్యక్తిగత ప్రాణరక్షణ తప్పనిసరి ఐన స్థితిలో తప్ప, ఇటువంటి చర్యలకు పూనుకోకుండా వివిధ రాజ్యాంగ వ్యవస్థలు, పజాసంఘాలు, మేధావులు తగిన చర్యలు ప్రచారం, ఆందోళనా చర్యలు చేపట్టాలి. నేరస్తులు, అనుమానితుల్ని శిక్షించడానికి ఎన్‌కౌంటర్లు మొదటి ఎంపిక కాకూడదనే అంశం జనాల్లో ప్రచారం కావాలి.. ప్రతి బాధిత వ్యక్తికీ న్యాయంకోసం అర్థించే అవకాశం ఇవ్వాలి. అలాకాకుండా, రాజ్యవ్యవస్థ ఇదే ధోరణిలో కొనసాగేట్లయితే, ప్రజలకు న్యాయప్రక్రియ మీద, న్యాయ వ్యవస్థమీద, నమ్మకం సన్నగిల్లి, బలమున్నవాడిదే రాజ్యంగా చెలాయించే  అటవికన్యాయం విస్తరించే ప్రమాదముంది. 

              అనిసెట్టి శాయుకుమార్‌ 

                    సెల్‌. 9440770531. 


Comments